close

అంతర్యామి

ఆత్మనిగ్రహం

ఉదయం నిద్ర లేవగానే ముడుచుకుని మొగ్గలా ఉండే మనసు నలుగురితో కలుస్తూ, నాలుగు పనుల్లో పడేసరికి క్రమంగా విచ్చుకోవాలి. చిరునవ్వుల్లో, మాటల్లో, చేతల్లో సౌరభాలు వెదజల్లాలి. అప్పుడే కార్యసఫలత ఒనగూడుతుంది. కొంతమంది విచార వదనంతో, విడివడని పెదవులతో భూభారాన్నంతా తమ భుజస్కంధాలపై మోస్తున్నట్లుంటారు. నాలుగునాళ్ల జీవితమిది. ఏ మనిషి జీవిత పుస్తకంలో అయినా ఉత్థానపతనాలు, కష్టసుఖాలు ఉంటాయి. ఆకర్షణీయంగా కనిపించే అట్టను చూసి, అదో గొప్ప పుస్తకం అనుకోవడం భ్రమే అవుతుంది.

ఏ పర్యాటక ప్రదేశానికైనా వెళ్లినప్పుడు గుర్తుగా గంధపు చెక్కనో, రంగురాయినో, సుగంధ ద్రవ్యాలనో జ్ఞాపికగా తెచ్చుకుంటాం. భద్రంగా దాచుకుని, అప్పుడప్పుడు తరచి తరచి చూసుకుని, జ్ఞాపకాలను స్పృశిస్తూ మురిసిపోతాం. అలా మనసు పొరల్లో మధురస్మృతులు ఉండాలే తప్ప- విషాద వీచికలకు చోటుండకూడదు.
నవ్వన్నది కృతకంగా పెదాలపై అద్దుకున్నది కాకూడదు. హృదయం అట్టడుగు నుంచి అమృతపు ఊటలా ఉబికి వచ్చి అది పెదాలపై నృత్యం చేయాలి. ఆ నవ్వుకు అందరూ ముగ్ధులైపోవాలి.

మనిషి నడిచే యంత్రం కాదు. అనుభూతులను పంచాల్సిన మానవతామూర్తి. కాలానుగుణ ధర్మాలను ఏర్పరచుకుని, నిబద్ధతకు కట్టుబడి, ఎవరినీ నొప్పించక, తానొవ్వక, తామరాకుపై నీటిబొట్టులా ప్రవర్తించాల్సిన కారుణ్యమూర్తి.

పనిమీద బయటికెళ్ళే మనిషికి ఎన్నో మనస్తత్వాలు ఎదురవుతాయి. కొన్ని ఉపకార గుణ సమన్వితమైతే, మరికొన్ని అపకార హేతువులుగా ఉంటాయి. అనవసర వాగ్వివాదాలు, గొడవలు కార్యానుకూలతకు ప్రతిబంధకాలు. కార్యార్థి వాటిపై ఆసక్తి చూపడు. కార్యసాధనలో నిగ్రహం కోల్పోకూడదన్నది మొదటి సూత్రమని విజ్ఞులు అంటారు. మహాత్ముడు సూచించిన అహింసా మార్గం ఆత్మనిగ్రహానికి ప్రతీక. ఆంగ్లేయులు కవ్వించినా, రెచ్చగొట్టినా బాపూజీ తన నిగ్రహాన్ని సడలించలేదు. చివరికి బ్రిటిష్‌వారు దేశం వదిలి నిష్క్రమించక తప్పలేదు.

శరీరానికి దెబ్బ తగిలితే, దాని ప్రభావం మనసుమీద ఉంటుంది. దెబ్బకు కారకులైనవారిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న పగ పడగెత్తుతుంది. వివాదాలు మనసులో విష బీజాలై, పోనుపోను విషవృక్షాలవుతాయి. మనిషి ఆ సమయంలో సంయమనం పాటించాలి. గాంధీజీ ఒక చెంపమీద కొడితే రెండో చెంప చూపించమన్నది- మానసిక సంతులతను, సంయమనాన్ని ప్రదర్శించడానికే!

శారీరక ఆరోగ్యమన్నది మానసిక బలం మీద ఆధారపడి ఉంటుంది. అస్థిమితంగా తరచూ ఉద్రేకాలకు లోనయ్యే మనసు- శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. శరీరం మందులమయమవుతుంది. జీవితకాలాన్ని హరించివేస్తుంది. అననుకూల సందర్భంలో మనకు ఆవేశం, ఆగ్రహం కలిగినప్పుడు మన మధ్య చరించిన మహానుభావుల్ని, వారి ప్రసన్న దృక్కుల్ని, అమృతోపమానమైన మాటల్ని స్ఫురణకు తెచ్చుకుంటే- మానసిక నిశ్చలత్వం కలుగుతుంది.

సత్సంగాల్లో స్వామీజీలు, ప్రసంగాల్లో వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆత్మనిగ్రహం పెంచుకొమ్మని పదేపదే చెబుతుంటారు. ఆత్మనిగ్రహం కలిగిన వ్యక్తికి అరిషడ్వర్గ వికారాలు ఆమడ దూరంలో ఉంటాయి. సదా ప్రసన్నంగా ఉండేవారికి అందరూ ఆత్మబంధువులే! వారి కార్యసాధనకు వనరులు వెతుక్కుంటూ వస్తాయి. విజయావకాశాలు మెరుగుపడతాయి.
సమాజం అంటే జన సమూహం. సమష్టి భావనలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయి. సమాజం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇదో ముఖ్య కారణమవుతుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.