భవిష్యత్తు భద్రమే

అంతర్యామి

భవిష్యత్తు భద్రమే

నిషి ప్రాణం విలువైనదే అయినా శాశ్వతం కాదు. ఏ క్షణం ప్రాణం దేహాన్ని వదిలిపోతుందో తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ఎంత ధనం వెచ్చించినా, అపర ధన్వంతరుల పర్యవేక్షణలో రక్షణ  పొందుతున్నా- మనిషి మృత్యుంజయుడు కాలేడు. పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదని తెలుసుకున్న మానవుడు కనీసం వంద సంవత్సరాలు జీవించాలని ఆశ పడతాడు. మనిషిని నిండు నూరేళ్లు బతకమని వేదం ఆశీర్వదిస్తుంది. సహజ మరణాలకు సమాజం పెద్దగా స్పందించదు. వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు విలపిస్తారు. సన్నిహితులు దుఃఖిస్తారు. ఆ సమయంలో ఆత్మీయులు చలించినా ఆ బాధ తాత్కాలికమే. మనసుకు తగిలిన గాయం త్వరలోనే మానిపోతుంది. ఎవరి పనులు వారు చేసుకుపోతూంటారు. నిత్యకృత్యాలు, ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలగదు. కాని ఒక విపత్కర పరిస్థితిలో కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని చుట్టబెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూంటే మానవాళి అతలాకుతలం కాకతప్పదు. అనునిత్యం ప్రాణభయంతో బతకడం నరకప్రాయమే. జనజీవనం నెలల తరబడి స్తంభించినప్పుడు మనిషిని ఒంటరితనం వేధిస్తుంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ నిత్యం నేలకొరుగుతున్న ఆత్మీయుల కడచూపుకైనా నోచుకోక బతుకు వెళ్ళదీయడం దుర్భరం. కలనైనా ఊహించని ఉత్పాతం ఊపేస్తున్నప్పుడు ఉక్కిరిబిక్కిరైనవాడు కొద్ది సమయంలోనే తేరుకుని శత్రువును తుదముట్టించే ప్రణాళిక రచిస్తాడు. ప్రత్యక్షమైనా, పరోక్షమైనా యుద్ధంలో శత్రు నిర్మూలనకు శత్రువును బలహీనపరచే పటిష్ఠమైన వ్యూహరచన ముఖ్యం. బలవంతుడు నాకేమని అహంకారంతో కదం తొక్కడం అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి శత్రువును బలహీనపరచి విజయం సాధించాలి.
మహావీరులైన పాండవులు అజ్ఞాత వాసం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అణగిమణిగి కాలంగడిపి, కాలం కలిసి రాగానే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. విపత్కర సమయంలో ఓర్పు సహనాలే ఉపశమన మంత్రాలు. పిరికితనం, భయాలను మనసునుంచి పారదోలి, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతూ కర్తవ్య నిర్వహణలో మనసా వాచా కర్మణా నిమగ్నం కావడమే నిత్య కృషీవలుడి ఆరోగ్యసూత్రం. కష్టకాలంలో ఆందోళన చెందుతున్న ఆత్మీయులకు ధైర్యమనే దివ్య ఔషధాన్ని నూరిపోయగలవాడే ధర్మాత్ముడు.
వదంతుల వ్యాప్తిని అరికట్టి హిత వచనాలతో తోటివారిని ఉత్సాహపరచగలవాడే సత్యవ్రతుడు. పొరుగువాడి క్షేమం తన చేతిలో, తన చేతల్లో ఉందని గ్రహించగలిగిన వివేకవంతుడే ఊరికి ఉపకారి. జ్ఞానవంతులైన శాస్త్రవేత్తల మాటలకు విలువనిచ్చి ఆచరించగలవాడే సమాజ హితైషి. గృహనిర్బంధం అనివార్యమైనప్పుడు మమతానురాగాలు పంచుకుంటూ ఆనందించే కుటుంబీకులున్న గృహాలే స్వర్గతుల్యాలు. మనసు వికలమై, హృదయం భారమైనప్పుడు భగవన్నామస్మరణలో మనసు నిర్మలమై హృదయం ఆనంద నిలయమవుతుంది.
ఆచారం, ధర్మం, నడవడిక మొదలైన విషయాల్లో తన తండ్రి, తాత, ముత్తాతలు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్నే అనుసరించినవాడు సత్పురుషుడై కీడును పొందడని మనుస్మృతి చెబుతోంది. ఆపదలు వచ్చినప్పుడు మానవుడు కలతచెందక, ప్రసన్నచిత్తుడై సమబుద్ధి కలిగి ఉండాలని ఆర్య ధర్మం కర్తవ్యాన్ని ఉపదేశిస్తోంది. మనిషికి నిర్భయం, నిస్సంశయం, దృఢనిశ్చయం మూలధనాలని, వ్యతిరేక భావనలతో బాధపడేవారు భగవంతుడి ధ్యానంతో మనసు మళ్ళించుకోవాలన్న వివేకానందుడి సందేశమే నేటి మృత్యుంజయ మంత్రం.

- ఇంద్రగంటి నరసింహమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న