రామకథాశిల్పి - కృష్ణభక్తి

అంతర్యామి

రామకథాశిల్పి - కృష్ణభక్తి

వాల్మీకి ఆదికవి. వేదవేద్యుడైన పరమాత్మ దశరథుడి కుమారుడిగా అవతరించగా వేదం సాక్షాత్తు రామాయణ రూపంలో ప్రాచేతసుడి వల్ల వెలువడిందని ఒక ప్రాచీన శ్లోకం చెబుతోంది. ప్రచేతసుడంటే వరుణదేవుడని అర్థం. తపస్సు చేసుకుంటున్న బోయవాడిపై ఏర్పడిన పుట్టల్ని వరుణుడు తన వర్షధారలతో తొలగించి వెలుగులోకి తేవడంవల్ల ఆ బోయవాడు ప్రాచేతసుడయ్యాడని ఒక అభిప్రాయం. రుక్షుడు, రత్నాకరుడు అనే పేర్లు కూడా వాల్మీకి పరంగా వ్యవహారంలో ఉన్నాయి. వల్మీకమంటే పుట్ట, దాన్ని ఛేదించుకొని బయటపడినవాడు గనుక వాల్మీకి అయ్యాడు.

త్రేతాయుగంలో భృగువంశంలో సుమతి, కౌశికి దంపతుల కుమారుడు అగ్నిశర్మ. తండ్రి వేదాధ్యయనం చేయించినా వైదిక కర్మలు అతడి మనసుకెక్కలేదు. వివాహమైంది. అగ్నిశర్మకు ధనార్జనకు ఏ వృత్తీ దొరకలేదు. దుష్ట సాంగత్యంవల్ల హింసా ప్రవృత్తితో జీవించసాగాడు. ఒకనాడు సప్తరుషులు ఎదురుపడ్డారు. వారిని బాధించి వారివద్ద గల వస్తువులు కాజేయాలనుకున్నాడు. ఆ పాపం ఎందుకు చేస్తున్నావని మునులడిగారు. భార్యాబిడ్డల పోషణ కోసం తాను చేస్తున్న పని తప్పు కాదన్నాడు. అతడు చేస్తున్న పని ఉచితమో కాదో కుటుంబ సభ్యులనడిగి రమ్మన్నారు. అతడి తండ్రి, భార్యా పిల్లలు అతడి పాపంలో తమకు భాగం లేదన్నారు. జ్ఞానోదయమై మునుల దగ్గరకు వెళ్ళాడు. అగ్ని శర్మకు లోగడ సంభవించిన సర్వ పాపాల నివారణ కోసం అత్రిమహర్షి ధ్యానయోగం ఉపదేశించాడు.

చిరకాల తపఃఫలంగా వాల్మీకి మహర్షి అయ్యాడు. అతడికి నారదుడు రామకథను సంగ్రహంగా చెప్పాడనే గాథ ఒకటి లోకంలో వ్యాప్తిలో ఉంది. నారదుడు చెప్పిన శ్రీరాముడి చరిత్రను మననం చేసుకుంటూ శిష్యుడు భరద్వాజుడితో పాటు వాల్మీకి తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుపై క్రౌంచ పక్షుల జంట విహరిస్తుండగా ఒక వేటగాడు మగపక్షిని బాణంతో కొట్టి చంపాడు. ఆడపక్షి దీనంగా విలపించసాగింది. ఆ దృశ్యం చూడగానే కరుణరసార్ద్ర హృదయుడైన వాల్మీకి నోటివెంట వెలువడిన శ్లోకమే రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. రామాయణం ప్రధానంగా కుటుంబేతిహాసం. మానవ సమాజానికి శాశ్వత సందేశాన్ని అందించి విశ్వకావ్యంగా రూపొందించాడు వాల్మీకి. రామాయణంలో వాల్మీకి కళాత్మక అభివ్యక్తి గోచరిస్తుంది. గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలు చొప్పున రామాయణంలో 24 వేల శ్లోకాలు రచించాడు వాల్మీకి.

కృష్ణ భక్తుల్లో మీరాబాయి అగ్రగణ్యురాలు. రాజస్థాన్‌లో రాజకుమార్తెగా పుట్టి, రాజవంశానికి కోడలైనా సమస్త సుఖాలను త్యజించింది. 16వ శతాబ్దంనాటి భక్తి ఉద్యమంలో వాగ్గేయకారిణిగా భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రైదాస్‌ అనే సాధువు తన వద్ద ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని మీరాకు ఇచ్చాడు. బాల్యం నుంచి ఆ విగ్రహం చెంతనే కాలం గడిపేది. గిరిధరుడిపై భావుకతతో కీర్తనలల్లేది.

ఆమె రచించి గానం చేసిన పాటలు ‘మీరా భజనలు’గా భక్తి వాంగ్మయంలో ప్రసిద్ధికెక్కాయి. ఆమె రాగ గోవింద, రాగమీరా, రాగ మల్లిక అనే రాగాలను సృష్టించిందని తెలుస్తోంది. ఆమె కృష్ణుణ్ని భర్తగా భావించేది. రాజస్థానీ, బ్రజ్‌ భాషల్లోని ఆమె గీతాలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న