శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అంతర్యామి

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

లియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏటా 450కి పైగా రకాల ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటిలో బ్రహ్మోత్సవాలు విశిష్టమైనవి. అందులో భాగంగా ‘కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజం’ పేరుతో గర్భగుడిని కుంకుమపువ్వు, కర్పూరం, గంధం, పసుపులతో పుణ్యాహవాచనం చేస్తారు. మృత్తిక, ఔషధాలను నవధాన్యాల్లో కలిపి ‘గజారోహణం’ నిర్వహిస్తారు. ఉత్సవ ప్రారంభ సూచకంగా విజయ పతాకను ఎగరేసి ‘ధ్వజారోహణం’ చేస్తారు. ధ్వజస్తంభంపైన గరుడధ్వజ పటాన్ని ఎగరేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.

మొదటి రోజున జరిగే ‘అంకురార్పణ’ మానవదేహం చివురించడాన్ని సూచిస్తుంది. వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మ విష్ణు పురాణాల్లో ఈ విశ్లేషణ విస్తృతంగా కనిపిస్తుంది.

తొలుత శ్రీవేంకటేశ్వరుడి సేనాధిపతి విష్వక్సేనుణ్ని పూజిస్తారు. సర్పదోషాల నుంచి భక్తులకు ముక్తిని ప్రసాదించేందుకు మొదటిరోజున పెద్ద శేషవాహనం పైన ‘బంగారు తిరుచ్చి’ ఉత్సవం స్వామికి నిర్వహిస్తారు. రెండోరోజు ఉదయం అయిదు పడగల చిన్న శేషవాహనం పైన స్వామి మాత్రమే ఊరేగుతారు.  రెండోరోజు రాత్రి స్వామి సరస్వతీ రూపంలో హంసవాహనం పైన జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు ఊరేగుతారు. మూడోరోజు ఉదయం యోగ నృసింహస్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి, దుష్టశిక్షణ, శిష్టరక్షణకే అన్నట్లు స్వామి ఊరేగుతారు. మూడోరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కాళియ మర్దన చిన్నకృష్ణుడిగా కొలువు తీరి ముత్యపు పందిరి వాహనంపైన దర్శనమిస్తారు. నాలుగోరోజు ఉదయం కల్పవృక్షంపైన గోవుల గోపన్న అలంకారంలో మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. నాలుగోరోజు రాత్రి స్వామి సర్వభూపాల వాహనం పైన ఊరేగుతారు. అయిదోరోజు ఉదయం స్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిస్తారు. శ్రీకృష్ణస్వామివారు మరో పల్లకిలో అనుసరిస్తారు. అయిదోరోజు రాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపైన స్వామి ఊరేగుతారు. ఆరోరోజు ఉదయం స్వామి వేంకటాద్రి రాముడి అలంకారంలో హనుమంత వాహనం మీద కొలువుతీరుతారు. ఆరోరోజు మధ్యాహ్నం సపత్నీకుడైన మలయప్ప స్వామికి వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం శ్రీనివాసుడు బంగారు రథం అధిరోహిస్తారు. ఆరోరోజు రాత్రి గజవాహనంపైన స్వామి కొలువుతీరుతారు. వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణ కథనం. ఏడోరోజు ఉదయం సప్తాశ్వ సూర్యరథం పైన ఎర్రటి పూలమాలలతో స్వామి దర్శనమిస్తారు. ఏడోరోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో స్వామి దర్శనమిస్తారు. ఎనిమిదోరోజు ఉదయం సూర్యకిరణ కాంతుల్లో భక్తులు స్వయంగా పగ్గాలు పట్టుకుని లాగుతున్న రథంలో స్వామి ఊరేగుతారు. గుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడనే ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తాత్త్వికత ఈ రథోత్సవం ద్వారా ఎరుక అవుతుంది. అదే రోజు రాత్రి స్వామి అశ్వవాహనం మీద ఊరేగుతారు. తొమ్మిదోరోజు ఉదయం పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం తరవాత వరాహస్వామి ఆలయ ఆవరణలో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న