చర్య-ప్రతిచర్య

అంతర్యామి

చర్య-ప్రతిచర్య

సృష్టిలో చర్యకు ప్రతిచర్య తప్పదు. చర్యకు ఎలాంటి ప్రతిచర్య చూపుతున్నాం అనేది మన మనో పరిణతిని, గుణాన్ని తేటతెల్లం చేస్తుంది.

మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు దోమ కుడితే చేయి దానంతట అదే ప్రతిక్రియకు సిద్ధం అవుతుంది. అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటుంది సైన్స్‌. జాగ్రదావస్థలో ఉన్నప్పుడు వాదనలు, గొడవలు జరిగి ప్రత్యర్థుల నుంచి తిట్టడం, కొట్టడంలాంటి చర్యలు ఎదురైనప్పుడు నూటికి తొంభై మంది అవే ప్రతీకార చర్యలకు పాల్పడతారు. కొంతమంది మాత్రమే మనసును నియంత్రించుకుని, కోపాన్ని నిగ్రహించుకుని శాంతం వహిస్తారు.

స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీ మహాత్ముడు చూపిన అహింసాయుత బాట, ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించాలన్న సాధు స్వభావం ఆంగ్లేయుల మనసులను కరిగించింది. స్వేచ్ఛాస్వాతంత్య్రాల సముపార్జనకు పటిష్ఠమైన బాటలు పరచింది. దేశం యావత్తు ఆయనను మహాత్ముడిగా గుండెల్లో పొదువుకుంది.

ఛ్వాంగ్‌ ఝీ అనే చైనా తత్త్వవేత్త దారిలో వెళుతుంటే ఒకతను వెనక నుంచి వచ్చి ఆయనను కర్రతో కొట్టి పారిపోయాడు. అతడు భయంతో జారవిడిచిన కర్రను తీసుకున్న ఛ్వాంగ్‌ ఝీ ‘ఇదిగో నీ కట్టె తీసుకో’ అంటూ అతడి వెంటబడ్డాడు. అదంతా చూస్తున్న దారిన పోయే ఒకతను ఛ్వాంగ్‌ ఝీ ను ఆపి ‘వాడు నిన్ను కొట్టి పారిపోతుంటే, పట్టుకుని కొట్టాల్సింది పోయి, కర్ర తీసుకోమంటున్నా వేమిటి’ అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి సమాధానంగా ఛ్వాంగ్‌ ఝీ మందహాసం చేసి ‘ఒకరోజు నేను చెట్టు కింద నిద్రిస్తుండగా, ఒక ఎండు కొమ్మ విరిగి నా మీద పడింది. నేను తిరిగి చెట్టును తిట్టలేదు, కొట్టలేదు’ అని కర్ర ఇవ్వడానికి తనను కొట్టిన వ్యక్తి వెనకబడ్డాడు. అపకారికి సైతం ఉపకారం చేయడం ఉత్తమ భావ సంస్కారం.

అతడు నన్ను కొట్టాడు, తిట్టాడు, ఓడించాడు అన్న ఆలోచనలు మనసులో ఉన్నంతకాలం వైరం సమసిపోదు. విరోధంతో విరోధమెప్పుడూ అంతంకాదు, అది ప్రేమతోటే సాధ్యమవుతుంది అంటుంది   ధమ్మ పథం. ద్వేషంతో సమమైన పాపంగాని, పశ్చాత్తాపానికి సరితూగే శిక్షగాని లేవంటుంది బుద్ధగీత. మానవుడు సదా క్షమాగుణంతో శోభిల్లాలి.

సాధు జంతువుల విషయం పక్కనపెడితే, క్రూర జంతువులు తమను బాధ పెట్టేవారిపై దాడిచేసి కక్ష తీర్చుకుంటాయి.

మనిషి విచక్షణ గల జంతువంటారు పెద్దలు. మనసులోని దుష్ట భావాలను, రాక్షస ప్రవృత్తిని సద్గురువుల సాంగత్యంతో, బోధలతో, నిరంతర అభ్యాసంతో అదిమిపట్టి, అరికట్టి సాత్విక భావాలను పెంపొందించుకోవాలి. క్రూరత్వం నుంచి సాధు తత్త్వం వైపు మళ్ళగల అవకాశం ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక్క మనిషికే వరంలా లభించింది. ప్రతీకారం పొడచూపని హృదయం స్వచ్ఛమైన తటాకంలా ఉంటుంది. ఫలితంగా ముఖంలో దివ్యత్వం గోచరిస్తుంది. ఎదుటివారిలోని ప్రతీకార వాంఛను పటాపంచలు చేస్తుంది.

దేవతలు ఉత్తమ గుణ శోభితులైతే, రాక్షసులు ప్రవర్తన దృష్ట్యా అధములు. బృహస్పతికి ఉన్న విలువ, గౌరవం తెలిసినవే. కేవలం రాక్షసులకు గురువైనందువల్ల- శుక్రాచార్యుడికి అవి దక్కలేదు.

కంటికి కనిపించని మనసును కట్టడి చేస్తే ప్రతి మానవుడూ మాధవ సమానుడు అవుతాడు. జగత్తు శాంతి సౌభాగ్యాలతో స్వర్గాన్ని తలపిస్తుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న