పరాధీనత్వం

అంతర్యామి

పరాధీనత్వం

స్వశక్తిని విడిచి పరాధీనులమై దీనంగా జీవించడం అవమానకరం. మనిషి ఎప్పుడూ ధైర్యంగా నిశ్చయ భావంతో అడుగులు ముందుకు వేసి బతకాలని కోరుకుంటాడు. ఆత్మవిశ్వాసం, స్థిరత్వం- విజయాలకు, సంతోషకరమైన జీవితాలకు మార్గాలు. ఎవరో వచ్చి మన కష్టాలను తీరుస్తారని ఆశించడమంత అజ్ఞానం మరొకటి లేదు. తన శక్తియుక్తులపై మనిషికి నమ్మకం ఉండాలి. మనలోని ప్రాజ్ఞత, వనరులు, సాధన సామగ్రిని కూడగట్టుకొని పరులపై ఆధారపడకుండా అందుకొన్న విజయాలు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అప్పుడు మనకు మనమే యజమానులం. అలాంటి వ్యక్తిత్వం కలిగినవారు నిశ్శబ్దంగా నిస్సందేహంగా నిబ్బరంగా కలత చెందకుండా లక్ష్యాలను సాధిస్తారు. ఎలాంటి సవాళ్లనైనా ఎవరిపై ఆధారపడక ఎదుర్కొనేవాడే ధీరుడని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. మనలోని స్థిరసంకల్పమే నిజమైన బలం. ఆ శక్తిని ఆధారం చేసుకొని వనరులను సమకూర్చుకొని సాధించిన కార్యాలు సంతృప్తితో పాటు ఆత్మ బలాన్నిస్తాయి.
వాగ్గేయకారుడు త్యాగరాజు తన మొదటి భార్య పార్వతి మరణం తరవాత ఆమె చెల్లెలు కమలాంబను వివాహం చేసుకోవాలని కోరుతూ అత్తగారి వైపువారు ప్రస్తావన తెచ్చారు. ఇందుకు అన్న జపేశుడు సైతం అంగీకరించాడు. ఒక మంచిరోజు చూసుకుని త్యాగయ్య పట్టు అంచు ధోవతి, తెల్లని చొక్కా ధరించి పెళ్ళి చూపులకని తంజావూరు దగ్గర్లోని ఆలంపాలెం బయలుదేరాడు. ఒక ఎడ్లబండినెక్కిప్రయాణం ప్రారంభించాడు. ఆలంపాలెం పొలిమేరల్లోకి వెళ్ళగానే ఆ బండి చక్రం పెద్ద బురద గుంటలో పడింది. బండివాడు ఎంత ప్రయ త్నించినా ఆ చక్రాన్ని దారిపైకి ఎక్కించ లేకపోయాడు. త్యాగయ్య తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నందువల్ల బురద అంటుతుందేమోనన్న భయంతో బండిలో నుంచి దిగలేదు. సాయం పట్టడానికి ఎవరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు. సమయం మించిపోతోంది. ఇక తన రాముడే దిక్కనుకొని- ‘బాల కనకమయచేల సుజనపరిపాల శ్రీరమాలోల... సుభద కరుణాలవాల’ అంటూ తన రాముణ్ని ఆర్తితో ఏలా నీ దయరాదూ అంటూ అఠాణ రాగంలో కీర్తన రూపంలో ప్రార్థించాడు.

ఆర్తత్రాణ పరాయణుడైన రాముడు మారువేషంలో సంపద్వంతుడై కనకమయమైన ధోవతి ధరించి రాజభూషణాలతో కనపడి- ‘అయ్యో బండి బురదకుంటలో పడిందే... మరి ఎలా?’ అని త్యాగరాజును ప్రశ్నించాడు. ‘అయ్యా మీరెవరో కానీ... చక్రాన్ని పైకి లాగడంలో మా బండివాడికి సహాయపడండి’ అని కోరాడు. ‘మీరే బండి దిగి సాయం చేయొచ్చుగా’ అని ఆ ఆగంతకుడు అడిగాడు. ‘నాది పట్టుపంచె, తెల్లని చొక్కా... బురద మరక అంటితే బాగుండదని దిగలేకపోతున్నాను’. ‘భలేవాడివయ్యా నాది కనకమయ చేలం (బంగారు ధోవతి) పైగా ఎంతో విలువైన వస్త్రాలు... మరక అంటించుకుని ఇంటికి వెళ్తే నా భార్య శ్రీరమ ఊరుకోదు. నీవు బండి దిగి పంచె పైకి కట్టుకొని మరక అంటకుండా ప్రయత్నం చేయి. నా వంతు సహాయం నేను చేస్తాను’ అన్నాడు. తప్పదనుకొని త్యాగయ్య బండిపై నుంచి జాగ్రత్తగా దిగి చక్రం పట్టుకుని శక్తిని కూడగట్టుకుని తోశాడు. ఆగంతకుడు బండి ఎడ్లపక్కన చేరి వాటి మూపురాలను, గంగ డోలును నిమిరాడు. వెంటనే అవి ముందుకు వేగంగా కదలడంతో బండి దారిపైకి చేరింది. ప్రయత్నం నీది సహకారం మాత్రమే నాది సుమా అంటూ ఆ వచ్చిన పెద్దమనిషి గబగబా నాలుగడుగులు వేసి అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వచ్చినది తన రాముడేనని త్యాగరాజుకు తెలిసివచ్చింది.

మానవ ప్రయత్నమే గొప్పదని దైవం సైతం చెబుతాడు. శక్తి చైతన్యాన్ని కలిగిస్తుంది. దేవుడా నీవే దిక్కు అంటూ చతికిలపడటం బలహీనుల  గుణం. తనపై తనకు నమ్మిక, పట్టు, విశ్వాసం కలిగిన వ్యక్తి దైవాన్నైనా సాధించగలడు.

- అప్పరుసు రమాకాంతరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న