close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సృష్టికి ఆది - ఉగాది

‘చైత్ర శుద్ధ పాడ్యమిని బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభానికి శుభముహూర్తంగా ఎంచుకున్నాడు’ అన్నాడు ‘నిర్ణయసింధు’కర్త. తెలుగు ఉగాదినాడు సృష్టి ఆరంభమైందని దాని అర్థం. ఆ రోజు తలారా స్నానం చేసి దేవతార్చన మొదలుపెడుతూ కొత్త సంవత్సరం పేరు పలకాలని ‘ధర్మసింధువు’ నిర్దేశించింది. ఉగాదిని భక్తితో స్వాగతించాలని సూచించింది. గత ఏడాది శార్వరితో సంకల్పం చెప్పినవారంతా ‘శ్రీప్లవ’తో దేవతారాధనకు శ్రీకారం చుడితే- వసంత రుతు తొలివేకువకు స్వాగత తోరణం కట్టినట్లవుతుంది.
‘సత్పురుషులు లోకంలో వసంత రుతువు మల్లె సంచరిస్తారు’ అన్నారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. పచ్చదనం తగ్గి వెలవెలబోయిన ప్రకృతి కొత్త పూలనెత్తావులతో వినూత్న శోభలతో అలరారడం చైత్ర మాసంతో మొదలవుతుంది. అందుకే దీన్ని మధుమాసం అన్నారు. వసంతం ఆవరించేసరికి వన సౌందర్యం ఇనుమడించి గండు కోయిలలు తమ గొంతులను సవరిస్తాయి. కమ్మని స్వరాలతో కాలపురుషుడికి స్వాగతాంజలి సమర్పిస్తాయి.
పరగడుపున నింబకందళ భక్షణం, పదిమందితో కలిసి పంచాంగ శ్రవణం... అనేవి ఉగాది నాటి ముఖ్య కార్యక్రమాలు. నింబకుసుమం అంటే వేపపువ్వు. దీనికి చూతకుసుమం (లేత మామిడి చిగురు) కొత్త బెల్లం నెయ్యి అరటిపళ్లు చెరకుముక్కలు కొత్త చింతపండు చేర్చి సమపాళ్లతో చేసిన ఉగాది పచ్చడిని కొత్త మట్టిపాత్రలో ఉంచుతారు. దాన్ని ప్రసాదంగా భావించి పూజాదికాల అనంతరం స్వీకరిస్తారు. ‘సర్వ అరిష్ట వినాశాయ నింబకందళ భక్షణం... వేప పూత పచ్చడిని ఆరగించడమే సకల అరిష్టాలకు సరైన విరుగుడు’ అని శాస్త్రవచనం. ఉగాది ప్రసాదంలో విభిన్న రుచులు మనిషి మనుగడలోని ఆటుపోట్లకు ప్రతీకలు.
కాలం భగవంతుడి స్వరూపం. దాని నడకను వివరించడమే పంచాంగ పఠనం లక్ష్యం. పంచాంగమంటే వివిధ రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల పట్టికే కాదు. కాలమాన పరిస్థితులకు, గ్రహ రాశుల సంచారానికి చెందిన సమగ్ర సమాచారమే పంచాంగం. రాశి ఫలాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకొంటూ గెలుపుదారిలో సాగిపోవాలన్నది పంచాంగ శ్రవణంలోని అంతస్సూత్రం. గ్రహ సంచారం గందరగోళంగా ఉన్నప్పుడు తగిన పరిహారాలేమిటో పంచాంగకర్తలే సూచిస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆహారనియమాలు అవలంబించినట్లే, గ్రహాలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు నియంత్రణ పాటించడమే మేలు. తుపాను గాలికి తలవంచిన గరిక పరికలా కాలం కలిసిరాగానే తిరిగి దశ కుదుటపడుతుంది. ఈ పట్టువిడుపుల గురించి ముందుగా హెచ్చరించడమే పంచాంగ పఠనంలోని అంతరార్థం. ముందుచూపు అలవడాలనే తప్ప విని బెంగ పెట్టుకొమ్మని కాదు. కాలం ప్రతికూలంగా వచ్చినప్పుడు వినమ్రతతో గ్రహాల అనుకూలతకై ప్రార్థించాలి. ‘అనుగ్రహం’ అనే మాటకు తాత్పర్యం అదే!
విభిన్న రుచుల సమ్మేళనంతో కష్టసుఖాల పట్ల సమభావనను అలవరుస్తూ జీవన తాత్వికతను బోధించే ఉగాది పంచాంగ శ్రవణంలో గ్రహరాశుల విశేష సూచనలను వివరిస్తూ మనిషి మనుగడకు సరైన మార్గాన్ని తేటపరుస్తుంది. విజయానికి బాటలు వేస్తుంది. అందుకే అది మనకు పండుగ అయింది.

- వై.శ్రీలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు