close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సత్వర ముక్తి మార్గం

‘భగవదనుగ్రహం ఉంటే జ్ఞానులు, యోగులు, సిద్ధుల కంటే సామాన్య సంసారులకే మోక్షం త్వరగా లభిస్తుంది’ అని భాగవతం సూచిస్తోంది. దానికి కారణాన్ని సైతం సోదాహరణంగా చెబుతోంది. జ్ఞానులు, యోగులు వంటివారు ముక్తులు కావడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది.
వివిధ శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన సాధనలన్నీ చేయాలి. ఉపాసన, ఉపదేశాలతో నిష్ఠలో, నియమంలో నిగ్గుతేలాలి. ఏ విషయంలోనూ ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు. పైగా తాము సంపాదించిన వాటన్నింటినీ లోకోపకారానికే వినియోగించాలి. అందువల్ల బ్రహ్మజ్ఞానికి సైతం మోక్షం రావడానికి చాలా కాలం పడుతుంది. ఎవరికైనా మోక్షం రావాలంటే వారు చేసిన దుష్కర్మ ఫలితాలే కాదు, సత్కర్మ ఫలితాలు సైతం తరిగిపోవాలి.
శిశిరంలో చెట్లు తమ ఆకులన్నింటినీ రాల్చేసుకున్నట్లు, జీవులు తమ సత్కర్మ ఫలితాలతో పాటు, దుష్కర్మ ఫలితాలను సైతం తమంత తామే వదిలించుకోవాలి.
సత్కర్మలు ఎక్కువగా చేసినందువల్ల, దుష్కర్మల ఫలితాలు తరిగిపోతాయని భావిస్తారు కొందరు. కానీ అలా జరగదు. దేని ఫలితం దానిదే. సత్కర్మాచరణ ఫలితంగా గొప్ప ఇంటిలో జన్మించడం, భోగభాగ్యాలు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, సుఖాలు, సంతోషాలు లాంటివి కలుగుతాయి. అవి కలిగినవారు ఆ భౌతిక సౌఖ్యాలే శాశ్వతం అనుకుని వాటివెంటే వెంపర్లాడతారు. ఫలితంగా మోక్షం అనే ఆలోచనే రాదు సరికదా- వాటి మత్తులో పడి, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో అనేక దురాగతాలు, దుష్కర్మలు చేస్తుంటారు. ఆ కారణంగా మోక్షానికి దూరమవుతారు.
దుష్కర్మలు చేసినవారికి నీచ జన్మ, ఈతి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం, దౌర్బల్యం, దౌర్భాగ్యం లాంటి ఫలితాలు కలుగుతాయి. అలా కలిగే ఫలితాలను అనుభవించేటప్పుడు మానవుల ఆలోచనా సరళి ఇంకోలా ఉంటుంది. వారు సాధారణంగా ‘తమకీ బాధలు కల్పించినవాడు భగవంతుడే’ అనే భావనతో ఉంటారు. అందువల్ల సర్వవ్యాపకుణ్ని తలచుకునే ఆలోచన, అవకాశం లాంటివి రావు. ఒక వేళ వచ్చినా తమ పరిస్థితిని చక్కదిద్దమనే కోరికే తప్ప మిగిలిన విషయాల గురించి ప్రార్థించే ఆలోచనే వారికి రాదు. అంతేకాదు- ఆ పరిస్థితులను అధిగమించాలని ఈదులాడేసరికే వారికి సమయం సరిపోతుంది. అలాంటప్పుడు ఇక ముక్తి, మోక్షం ప్రసక్తే లేదు.
ఏదేమైనా రెండు ఫలితాల్నీ అనుభవించక తప్పదు. ఆ ఫలితాలను అనుభవిస్తూ ముక్త స్థితికి చేరే మార్గాన్ని సూచిస్తోంది భాగవతం. తాత్వికులు, యోగులు, బ్రహ్మజ్ఞానులు లాంటి వారికి శాస్త్రజ్ఞాన, తపోజ్ఞాన, యోగజ్ఞాన తదితరాల నిరంతర సాధనల ద్వారా ఏకాగ్రచిత్తుడై పరబ్రహ్మ పట్ల తదేక దృష్టి కలవాడై ఉండి, వాటివల్ల కలిగే ఏ ఫలితాన్నైనా భగవదర్పితం చేయాలన్నది సూచన. ఎవరికి వారు నిర్దేశిత కర్మాచరణ చేస్తూ పరమాత్మను శరణాగతి చేయడం, చేసే ప్రతి పనీ భగవదర్పితంగా చేయడం, నీతి నియమాలతో జీవితం గడపడం- ఉత్తమం. జీవులందరిలోనూ పరమాత్మను దర్శిస్తూ, వారికి తమ శక్తి మేరకు సేవ చేయడం, అలా చేసిన సేవ పరమాత్మకే చేస్తున్నానని భావించడం, చేసే పని ఫలాపేక్ష రహితంగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది.
పై రెండు మార్గాల్లోనూ సామాన్యులకు సూచించిన మార్గమే ఆచరణకు సులభమైనది. అందువల్లనే జ్ఞానులు, యోగులు, సిద్ధులకంటే సామాన్య సంసారులకే మోక్షం త్వరగా లభిస్తుంది అంటోంది భాగవతం.

- అయ్యగారి శ్రీనివాసరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు