close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భీష్మసందేశం

భారతేతిహాసాన్ని, భారతావనిని ప్రభావితం చేసిన అమోఘ పాత్ర భీష్ముడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సౌఖ్యం కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా ఇతడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. పూర్వజన్మలో అష్టవసువుల్లో ఎనిమిదో వాడైన ఇతడు వసిష్ఠుడి శాపకారణంగా గంగాదేవి గర్భాన శంతనుడి పుత్రుడిగా జన్మించాడు. సుదీర్ఘ కాలం కురువంశానికి రక్షకుడిగా నిలిచిన ఇతడు తండ్రి ప్రసాదించిన వరంతో స్వచ్ఛంద మరణ భాగ్యాన్ని పొందిన మహాభాగ్యశాలి.
భీష్ముడు కౌరవులకు, పాండవులకు పూజ్యస్థానంలో నిలిచాడు. కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో కౌరవుల పక్షాన పదకొండు రోజులపాటు యుద్ధం చేసి గాయపడి, అంపశయ్యపై పడుకొని, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా వేచి ఉండి, యాభై ఎనిమిది రోజుల అనంతరం మాఘ శుద్ధ ఏకాదశినాడు పరమపదాన్ని (మోక్షాన్ని) అధిష్ఠించిన కారణంగా ఈ తిథిని ‘భీష్మ ఏకాదశి’ అని పిలవడం పరిపాటిగా మారింది.
భీష్ముడు ధర్మాధర్మాలను చక్కగా తెలిసిన ధర్మమర్మజ్ఞుడు. తనను ఆశ్రయించిన ధర్మరాజుకు ఎన్నో ధర్మసూక్ష్మాలను బోధించాడు. రాజనీతులను విశదపరచాడు. ధర్మరాజు కోరిక మేరకు సర్వాంతర్యామి అయిన మహావిష్ణువు తత్త్వాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం తెలియజేసిన పుణ్యాత్ముడు భీష్ముడు. ఈయన ప్రసాదించిన విష్ణు సహస్రనామ స్తోత్రం నేటికీ సకల లోకానికీ నిత్యపఠనీయమైంది.
ధర్మసంస్థాపన కోసం భూలోకంలో అవతరించిన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వాడు భీష్ముడు. దీనికి కారణం భీష్ముడి హృదయం ధర్మమయం కావడమే.
మహాభారత యుద్ధంలో అర్జునుడు తన శరపరంపరతో భీష్ముణ్ని నేలకూలే విధంగా చేసి, ఆ మహానుభావుడిపై గల భక్తితో బాణాలతోనే శయ్యను ఏర్పరచి, దానిపై పడుకొనేట్లు చేశాడు. శరతల్ప గతుడైన భీష్ముడు ఉత్తరాయణంలో మాఘ శుద్ధ సప్తమి మొదలుకొని రోజుకొక్క ప్రాణాన్ని విడుస్తూ, మాఘశుద్ధ ఏకాదశినాడు తన అయిదో ప్రాణాన్ని కూడా వదిలివేసి మోక్షపదాన్ని చేరుకొన్నందువల్ల ఈ దినం అందరికీ ఆరాధ్యం అయింది. ఈ అయిదురోజుల కాలాన్ని ‘భీష్మపంచకం’ అనే పేరుతో ఆస్తికులు పిలుస్తారు.
‘మా’(వద్దు) ‘అఘం’(పాపం) అంటే ‘పాపాలు చేయవద్దు’ అని చెప్పేది మాఘమాసం. నిర్మలత్వానికి ప్రతీక శుక్లపక్షం. ఉత్తరోత్తరాభివృద్ధికి సంకేతం ఏకాదశ తిథి. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ తిథిలోగల ప్రత్యేకతలన్నీ భీష్ముడిలోనూ ఉన్నాయి. భీష్ముడు పాపరహితుడు. సుగుణ నిర్మలుడు. అభ్యుదయ పరంపరలకు మూలంగా నిలిచినవాడు. ఈ విధంగా మాఘశుద్ధ ఏకాదశి మహిమోపేతమై అలరారుతోంది.
లోకంలో మానవులు తమ వంశాలలోని పూర్వజులైన పెద్దలను తలచుకొనే సందర్భంలో ‘ఇతడు భీష్మపితామహుడి వంటివాడు’ అని చెప్పడం పూజ్యతకు, జ్యేష్ఠతకు, శ్రేష్ఠతకు  సంకేతంగా కనబడుతుంది. దృఢ ప్రతిజ్ఞకు ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే పేరు వచ్చింది.
భీష్ముడి అవతారం సమాజానికి గుణాత్మక  సందేశాన్ని అందిస్తోంది. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడం కోసం ఎంతటి త్యాగాలనైనా సంతానం చేయాలని సూచిస్తోంది భీష్ముడి చరిత్ర. ప్రతిజ్ఞ చేయడం గొప్పకాదు, దాన్ని జీవితాంతం వరకు నిలుపుకోవడం గొప్పతనం అని ప్రబోధిస్తోంది. మాట నిలబెట్టుకోవడం కోసం జీవితాన్ని కర్పూరంలా హరించిన భీష్ముడి త్యాగం సామాజిక సందేశాత్మకం. అందుకే భీష్ముడి నిర్యాణదినం మానవాళికి పర్వదినంగా మారింది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు