close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భక్తి - శక్తి

అంతరంగంలో కలిగేది భక్తి. దాని శక్తి అపారం. భక్తి పొంగులువారే వారిలో శుద్ధత, సరళత్వం, భగవంతుణ్ని పొందాలనే ఆకాంక్ష ద్యోతకమవుతుంటాయి. తనకోసం ఏమీ కోరుకోకపోవడం, స్వార్థపరత్వం కపటంలాంటివేమీ లేకపోవడంవల్లే భక్తికి అంతటి శక్తి వస్తుంది. అలాంటి భక్తే  ఫలిస్తుంది.

జ్ఞానులు, మౌనులు, యోగ సంవిధానులు తదితరులెవరైనా బంధించాలని ప్రయత్నిస్తే వారికి చిక్కని ఆ పరమాత్మ స్వరూపుడు భక్తియుతులకు మాత్రమే వశమవుతాడని భాగవతంలోను, ఇతర పురాణాల్లోను అనేక విధాలుగా చెప్పారు కర్తలు. భక్తి వివిధ రూపాల్లో ఉంటుంది. ఇతరులకు భక్తిగా కనిపించని విషయం భక్తియుతులకే తెలుస్తుంది. ఆ పరమాత్మ ఆకార రహితుడు, శుద్ధుడు, నిత్యుడు, దివ్య స్వరూపుడు. పవిత్ర చిత్తం కలిగిన భక్తులే ఆయనను చూడగలరు, చేరగలరు.

తల్లి తన సంతానంలో ఎవరికి కావలసిన వాటిని, వారికి కావలసిన విధంగా అందించేటట్లే భగవంతుడు భక్తులకు వారివారి ఇచ్ఛానుసారం సారూప్య, సామీప్య, సాలోక్య మార్గాల్లో సాయుజ్యాన్ని ప్రసా దిస్తాడు. వీటన్నింటికీ పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.   

‘బంధవిముక్తి, శోకనివృత్తి, పారమార్థిక సిద్ధిని పొందాలనుకున్నవారు ఆధ్యాత్మిక జీవనాన్ని వీలైనంత తక్కువ వయస్సులోనే ప్రారంభించాలి’ అనేదానికి ఉదాహరణగా ప్రహ్లాదుణ్ని, ధ్రువుణ్ని చూపారు. బాల్యం నుంచి మహావిష్ణువు పట్ల ఉన్న భక్తి నుంచి ప్రహ్లాదుడి మనసు మరల్చాలని శతవిధాల ప్రయత్నించాడు హిరణ్య కశిపుడు. చిన్నపిల్లవాడైనా తన తండ్రి పెట్టిన క్రూరమైన కష్టాలన్నింటినీ తట్టుకుని, విష్ణునామ సంకీర్తనను పారవశ్యంతో కొనసాగించాడు ప్రహ్లాదుడు. చివరికి మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకొమ్మన్నప్పుడు అతడు ‘అజ్ఞానులైన ప్రజలకు ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి వ్యామోహం ఉంటుందో, అటువంటి వ్యామోహాన్ని నీ పట్ల నాకు కలగజేయి’ అని అడిగాడు. దాన్నిబట్టే భక్తిలోని మాధుర్యం ఏమిటో అర్థం అవుతుంది.

అయిదు సంవత్సరాలైనా నిండని బాలుడు ధ్రువుడు. బాల్యచాపల్యంతో మొదలైన కోరిక  పరిస్థితుల ప్రభావంతో పట్టుదలగా మారింది. ఆపై నారదుడి ఉపదేశం, మార్గదర్శనంతో భక్తిగా రూపాంతరం చెందింది. కడకు శాశ్వతంగా ఆకాశంలో వెలిగే తారగా మారాడు.

‘నేను’ అనే అహం వీడిన తరవాత, లేదా నువ్వేతప్ప మరో దిక్కు లేదనే శరణాగత స్థితికి చేరాకే- ఆయన సాయం చేయడానికి పూనుకొంటాడు. దానికి ఉదాహరణగా భాగవతంలో గజేంద్రుడు, కుచేలుడు, భారతంలో ద్రౌపది, అర్జునుడు, ఘటోత్కచుడు తదితరుల్ని ఉటంకించవచ్చు.

ఇలా... భక్తులు తమ జీవితాల్లో భగవంతుడి కోసం పడ్డ తపనను ఆదర్శంగా తీసుకుని, ఇతరులు సైతం భగవంతుడి కోసం తీవ్రమైన ఆత్మీయతను పెంపొందించుకుని, పట్టువదలకుండా సాధనను కొనసాగించాలనే బోధనే దీని అంతరార్థం.

పారమార్థిక చింతన, ఆధ్యాత్మిక భావనలతో సర్వస్వం భగవంతుడికి అర్పించిన వారికే ఆ పరమాత్మ అండగా ఉంటాడు. ఆదుకుంటాడు.

‘భగవంతుడి వైపు భక్తుడు ఒక అడుగు వేస్తే భక్తుడి వైపు భగవంతుడు పది అడుగులు వేస్తా’డనే నానుడి లోకప్రసిద్ధం.

భక్తులు భగవంతుడి పట్ల  నిశ్చలమైన, నిర్వికల్ప భక్తి కలిగి ఉంటే- ఆయనే వారిని తన కనుసన్నల్లో నడిపిస్తాడు. భయం పూర్తిగా నశిస్తుంది. భక్తికి ఉన్న శక్తివల్ల ఊహకు అందని అనేక అద్భుత విషయాలూ బోధపడతాయి.

- అయ్యగారి శ్రీనివాసరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.