close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధర్మాన్ని రక్షిస్తే తిరిగి కాపాడుతుంది!

గవంతుడు మనిషిని సృష్టించి అపారమైన శక్తిగల మెదడు కేంద్రంగా జ్ఞానం ప్రసాదించాడు. ఆది మానవుడు వేలమైళ్లు కాలినడకన తిరిగేవాడు. కందమూలాలే అతడి ఆహారం. ప్రకృతితో మమేకమై స్వేచ్ఛగా సంచరించేవాడు. అప్పటి మనిషి జ్ఞానం తిండి, బట్ట, నివాసం సమకూర్చుకునేందుకే పరిమితం. కాలచక్రభ్రమణంలో మనిషి మెదడుకు పదునుపెట్టాడు. అపారమైన జ్ఞాపకశక్తితో అంతులేని జ్ఞానసంపద తన సొంతమవుతుందని గ్రహించగలిగాడు. డబ్బును సృష్టించుకున్నాడు. ప్రకృతి సంపదకు ధర నిర్ణయించాడు. సౌకర్యవంతమైన జీవితాన్ని అభిలషించాడు. ఆశ పెరిగింది. యంత్ర పరికరాలు తయారుచేయగలిగాడు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించసాగాడు. కంటికింపైన వస్త్రధారణకు ప్రాధాన్యమిచ్చాడు. సకల సౌకర్యాలు సమకూర్చుకున్నాడు.

నదీజలాల సహజగమనాన్ని నిరోధించి తన అవసరాలకు అనుగుణంగా మళ్లించసాగాడు. రసాయన ఎరువులతో భూమిని కలుషితం చేశాడు. మనిషి సృష్టించిన వాయు కాలుష్యానికి అంతులేకుండా పోయింది. మనిషి తానే సృష్టికర్తనని భ్రమిస్తూ, భగవంతుడి సృష్టిని తన అవసరాలకు అనుగుణంగా మలచుకోవడానికే తన విజ్ఞానం పనికి వస్తుందన్న సత్యాన్ని విస్మరించాడు. స్వార్థంతో అహం కారిగా మారాడు.

తానెంతో శక్తిమంతడిని అనుకుంటున్న మనిషి విజ్ఞానం పరిమితమే. అది తుపానులను దారి మళ్లించలేదు. సునామీని అడ్డుకోలేదు. భూకంపాలను నివారించలేదు. కుంభవృష్టిని ఆపలేదు. కనీసం తన శరీరంలోని ఏ అవయవాన్నీ మనిషి స్వయంగా తయారుచేసుకోలేడు. భగవంతుడు ప్రసాదించిన రూపంతో తృప్తి పడవలసిందే. సకల చరాచర జగత్తు సృష్టించిన ఆది మధ్యాంతరహితుణ్ని ధిక్కరించి మనుగడ సాగించగలగడం అసంభవమని మనిషి గుర్తించాలి. స్వార్థ చింతనతో ప్రకృతిని ధ్వంసం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలుసుకోవాలి.

అల్లరిచేస్తూ ఇంటిలో విలువైన సామాన్లను నాశనం చేస్తున్న బాలుణ్ని కట్టడి చేయడానికి తల్లి పూనుకొన్నట్లే హద్దులు మీరి ప్రవర్తిస్తున్న మానవాళిని అదుపుచేయడానికి ప్రకృతి పూనుకొంటే తట్టుకోవడం అసాధ్యమే. ప్రకృతిని పూజిస్తేనే మానవాళికి భద్రత అని గ్రహించాలి.

ఇతర జీవులను హింసించి వినోదించే మనిషి తనను తాను గృహనిర్బంధంలో శిక్షించుకోవాల్సి వస్తుందని ఎన్నడైనా ఊహించగలిగాడా... గుంపులు గుంపులుగా తిరుగుతూ పంచభూతాలను కలుషితం చేస్తున్నవాడు మనిషిని మనిషి తాకడానికే భయపడే రోజొకటి ముందుందని గ్రహించగలిగాడా... కండలు పెంచిన వీరుడు సైతం దినదిన గండంగా భయంతో బిగుసుకుపోయే పరిస్థితి ఎదురవుతుందని భావించాడా... పుట్టిన వాడు గిట్టక తప్పదని తెలుసు. అయినా అనుక్షణం భయపడుతూ బతకాల్సి రావడం ఎంత దుర్భరం! మనిషికి మాత్రమే మంచి చెడులను ఎంచి చూడగల విచక్షణాశక్తిని పరమాత్మ ప్రసాదించాడు. ధర్మమార్గంలో పయనించేవారిని ధర్మమే రక్షిస్తుందని మననం చేసుకోవాలి.

విచక్షణాజ్ఞానంతో ఆత్మవిమర్శ చేసుకుని సత్ప్రవర్తనతో ఉద్ధరించుకునేందుకు, పశ్చాత్తాపంతో హింసకు స్వస్తి పలికేందుకు, పంచభూతాలను ఆరాధించేందుకు అవకాశం వచ్చింది. తనతోపాటు సమస్త ప్రాణికోటినీ స్వేచ్ఛగా బతకనిస్తానని ప్రమాణంచేసే సమయమొచ్చింది. కల్యాణకరమైన ఆలోచనలతో నిస్వార్థంగా భగవంతుణ్ని ఆరాధిస్తే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. మనిషి తన నడవడి మార్చుకుంటే ప్రకృతి పులకించి ఆశీర్వదిస్తుంది. జగన్మాత దయామయి... ఆపదలో ఉన్న తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి తెలుసు కదా!

- ఇంద్రగంటి నరసింహమూర్తి

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.