close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆచార్యుల ఉపదేశం

భారతీయ సమాజాన్ని ‘గురువు’ అనే పదాన్ని వేరు చేసి చూడలేం. ప్రపంచంలోని ఏ ఇతర దేశ సంస్కృతుల్లోకన్నా మన సంస్కృతిలో గురువు స్థానం విశిష్టమైనది. భారతీయ తాత్విక చింతనలో, సంప్రదాయ జీవన సరళిలో రుషి రుణం అనే గొప్ప భావన ఉంది. ఒకనాటి సమాజంలో రుషులే గురువులు. మనుషులకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సేవాసక్తిని, మానవతాధర్మాన్ని ప్రబోధించిన రుషులు మన గురు వ్యవస్థకు మూలం. సమాజ జీవనానికి చుక్కాని వంటివాడు గురువు. ఏ కాలంలోనైనా గురువు సమాజ హితాన్నే కోరతాడు. శివం లేని దేహం శవమైనట్లుగా ఆచార్యరహితమైన సంఘం ఎప్పుడూ శివశక్తికి దూరమవుతుంది.

పరసువేది ఇత్తడిని పుత్తడిగా మార్చుతుంది. గురువు శిష్యుణ్ని మరో పరసువేదిగా మార్చగలడు. గురుశిష్య సంబంధం తల్లీబిడ్డల సంబంధం వంటిది. భగవంతుడు-భక్తుల అనుబంధం లాంటిది. ‘నువ్వెవరివో నీకు తెలియజెప్పేవాడే గురువు. ఆ అసలైన ‘నువ్వు’గా మారడానికి దోహదం చేసేవాడే గురువు’ అన్నారు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు. ఒక ఆత్మ మరొక ఆత్మను ప్రకాశింపజేయగలదు. అటువంటి దీపమే గురువు. ‘గు’ అంటే అంధకారం. ‘రు’ అంటే దాన్ని నిర్మూలించే పరబ్రహ్మం. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానతేజం గురువు. ‘గ’కారం సిద్ధినిచ్చే గణేశ బీజం. ‘ర’కారం అశుభాలను అణచే అగ్నిబీజం. ‘ఉ’కారమంటే హరి. గురువు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. ఆచార్య సన్నిధిలో చదవని శాస్త్రం నిష్ప్రయోజనమన్నాడు శ్రీనాథుడు. ‘గురువు లేక విద్య గురుతుగా దొరకదు’ అన్నాడు వేమన. గురుతత్వాన్ని తెలుసుకోలేనివారికి యోగ, బోధ, వ్రత, తీర్థ, యాగ, జపాలు వ్యర్థమంటారు పండితులు. పరిశీలన, లోకజ్ఞత, విషయ పరిజ్ఞానం, యుక్తి, సరసత్వం, చాతుర్యం, సరళ స్వభావం, సమతా గుణం, సౌజన్యం గురువుకు అవసరమైన గుణాలు. గురువు తనను అర్థించినవారికి విద్య నేర్పనని చెప్పకూడదు. యోగ్యులు కానివారిని శిష్యులుగా స్వీకరించనూకూడదు.

పూర్వం మంచి గురువుల కోసం వెదికేవారు. ఇప్పుడు మంచి శిష్యులు లభించడం కష్టంగా ఉందని గురువులంటున్నారు. భక్తిశ్రద్ధలు గలవాడు, ప్రశంతమైన స్థిరమైన బుద్ధిగలవాడు, వివేకవంతుడు, కార్యశీలి, వినయవిధేయతల వంటి మంచి గుణాలతో విరాజిల్లేవాడు ఉత్తమ శిష్యుడు. భగవంతుడి గురించిన నిరంతర చింతన ఒక భక్తిమార్గమైనట్లు గురుచింతన కూడా శిష్యుడు అలవరచుకోవలసిన ఉత్తమ జీవన విధానం. గురువు మాటలకు ఎదురు చెప్పడం, పరుషంగా మాట్లాడటం- శిష్యుడికి తగనివి. శిష్యుడు అందలం ఎక్కినా సంపదలు వహించినా, సన్మానాలు, బిరుదులు లభించినా గురుకృపవల్లనే సిద్ధించాయని భావించాలి.

సుయోధనుడు గురువుల ఉపదేశం లెక్కచేయక నశించాడు. కర్ణుడు పరశురాముడివద్ద అసత్యం పలికి, అతడి శాపంవల్ల యుద్ధంలో విజేత కాలేకపోయాడు.

ఇందీవరాక్షుడు అదృశ్యరూపంలో ఉండే మంత్ర శక్తి(శాంబరి విద్య)వల్ల గురువు వద్ద ఆయుర్వేదం నేర్చుకుని తరవాత అతణ్ని అహంకారంతో విదిలించి శాపం పొందాడు. గుణవంతుడైన చంద్రుడు ధర్మం విడిచిపెట్టి గురుపత్ని తారను మోహించి గుణహీనుడయ్యాడు.

మానవకోటికి ఆదర్శప్రాయులైన గురుశిష్యులు మన దేశంలోనే కనిపిస్తారు. విశ్వామిత్రుడు-శ్రీరాముడు, వసిష్ఠుడు-దిలీపుడు, పరాశరుడు-మైత్రేయి, భాస్కరుడు-యాజ్ఞవల్క్యుడు, హనుమ; ద్రోణుడు-అర్జునుడు, సాందీపని-బలరామకృష్ణులు, ఆదిశంకరుడు-పద్మపాదుడు, మధ్వాచార్యుడు- రాఘవేంద్రస్వామి, చాణక్యుడు- చంద్రగుప్తుడు, సమర్థరామదాసు-శివాజీ... ఇంకా ఎందరో. వర్తమానంలో గురుశిష్య సంబంధాలు యాంత్రికమవుతున్నాయి.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.