close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలోచనా సుమాలు

త్రికరణాల్లో మనోకర్మలు మొదటివి. మనసు అనే మొక్కకు మనమే తోటమాలి. బీజాలు నాటడం నుంచి మొక్కగా ఎదిగేవరకు మనం ఎలా సాకుతామో అలా పెరుగుతుంది. మన జాగ్రత్తలన్నీ బీజాలు ఎంపిక చేయడంలోనే చూపాలి. అక్కడ పొరపాటు చేస్తే అమృతబీజాలకు బదులు విషబీజాలు పడతాయి. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటోకూడా మనం గ్రహించాలి.
అమృతబీజాలంటే- ప్రేమ, కరుణ, దానం, దయ వంటివి.
విషబీజాలంటే- అసూయ, ద్వేషం, కోపం, అహంకారం వంటివి.
మొదటివి పూలమొక్కల్ని మొలిపిస్తాయి. రెండోరకం- విషవృక్షాలు పుట్టిస్తాయి. బాల్యదశ తల్లిదండ్రుల సంరక్షణలో గడుస్తుంది. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపవలసింది వారే. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. వారి ప్రతి చర్యనూ పిల్లలు సమీపం నుంచి గమనిస్తుంటారు. కాబట్టి, తమనుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకునేట్టు పెద్దల ప్రవర్తన ఉండాలి.
చాలామంది పిల్లల పెంపకం అంటే తిండి, గుడ్డ, ఇతర సౌకర్యాలు, చదువు మాత్రమే అనుకుంటారు. వీటికంటే ఎంతో ముఖ్యమైనది సంస్కారం.
సంస్కారానికి సరైన నిర్వచనం సత్ప్రవర్తన. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు- ఇలాంటివన్నీ సత్ప్రవర్తన కిందికే వస్తాయి.
కొందరు పిల్లలు అతిగా మాట్లాడతారు. కొందరు మూతి కుట్టేసినట్టు అసలు మాట్లాడరు. అతిస్వేచ్ఛ, పట్టించుకొనకపోవడం వల్ల పిల్లలు వారికి తోచినదల్లా మాట్లాడుతుంటారు. ఈ అలవాటు మార్చుకోకపోతే పెద్దయ్యాక ఎవరూ వారి ‘అతి’ని భరించలేరు.
పిల్లలను అతిగా మందలించడం, ఏది చేసినా అందులో తప్పులు చూపడం వంటి పెద్దల ధోరణి పిల్లల్ని మానసికంగా మూగవారిని చేస్తుంది. వారు తమలో తాము సంభాషించుకుంటారే తప్ప, నోరుతెరిచి మాట్లాడరు. దీనివల్ల భావవ్యక్తీకరణలో వారు విఫలమవుతుంటారు.
‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన అద్భుతమంత్రం. పెద్దలు పిల్లల పెంపకం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్వులు ఏనాడో చెప్పారు.
‘రాజవత్‌ పంచవర్షాణి’ అంటూ ఆరంభమయ్యే ఆ బోధనా శ్లోకం- పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో, పదేళ్లు వచ్చేవరకు దాసులుగా, పదహారేళ్ల నుంచి మిత్రులుగా చూడాల్సి ఉంటుందని చెబుతుంది.
వాస్తవానికి ఇది పుత్రులకు వర్తించేలా చెప్పిన శ్లోకం. ఇప్పుడు పుత్రుడు, పుత్రికల మధ్య వ్యత్యాసాలు ఎవరూ చూపడంలేదు. పుత్రికలు పుత్ర సమానంగానే అన్ని విషయాల్లో ఉంటున్నారు. శరీరభేదం తప్ప, మనసుల్లో తేడా ఉండదు.
చాలామంది- పిల్లలకు సుఖంగా జీవించేందుకు సరిపడా ఆస్తులు ఇస్తే చాలనుకుంటారే తప్ప, సంస్కారమే గొప్ప ఆస్తి అనే సత్యాన్ని గ్రహించరు.
బాల్యంలో మనసులో పడిన బీజాలు పెరిగి పెద్దవై జీవితకాలం ఉండిపోతాయి. అందువల్ల విషబీజాలు పడకుండా పెద్దలు జాగ్రత్త చూపాలి.
ఆత్మశక్తి గలవారు, ఇతరుల ప్రభావాలకు లోనుకారు. తమ వ్యక్తిత్వాన్ని తామే నిర్మించుకుంటారు. తమ సంస్కారాన్ని చక్కదిద్దుకుంటారు. ఇలాంటివారే సమాజ క్షేమంకోసం పాటుపడతారు. వారికి ఆధ్యాత్మిక జ్ఞానంపట్ల ఆసక్తి, అనురక్తి కలుగుతాయి. ఫలితంగా తమకై తాము మనోకాలుష్యాలను తొలగించుకోగలుగుతారు. మనసును పవిత్రమైన భూమికగా చేసుకుని, అమృత బీజాలను నాటుతారు. అవి ఫలించి, మానవీయ పరిమళంతో ప్రభవించే ఆలోచనా సుమాలవుతాయి. సత్సమాజ నిర్మాణానికి అవే ఆలంబనమవుతాయి.

- కె.విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు